అమరావతి: రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు మోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఢీకొట్టడం అంత సులభమేమీ కాదు. కానీ, చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా సవాళ్లు విసురుతూ వచ్చారు. జగన్ చంద్రబాబును ఢీకొట్టడం వెనక కృషి అంతా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మంత్రాంగమే ఉందని అంటారు. 

విజయసాయి రెడ్డి 2016 వరకు రాజకీయ తెర మీద కనిపించలేదు. జగన్ రాజ్యసభ సభ్యుడిగా పంపించినప్పటి నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. పార్టీలో జగన్ తర్వాత విజయసాయి అన్నంతగా ముందుకు వచ్చారు. జగన్ ఇచ్చిన స్వేచ్ఛను ఆయన వాడుకుని పార్టీని బలోపేతం చేయడంలో, బిజెపితో సంబంధాలను మెరుగుపరచడంలో తీవ్రమైన కృషి చేశారు. 

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ వచ్చారు. పార్టీకి ఆయన జాతీయ స్థాయి గొంతుగా మారారు. తద్వారా బిజెపితో చంద్రబాబు సంబంధాలను దెబ్బ తీయడంలో ప్రధాన పాత్ర పోషించారని అంటారు. 

ఇటీవలి ఎన్నికల్లో విజయసాయి రెడ్డి నిర్వహించిన పాత్ర చిన్నదేమీ కాదు. తెలుగుదేశం పార్టీ తేరుకునే లోపే వ్యూహాలను సిద్దం చేసి, అమలు చేశారు. ఈసీకి ఫిర్యాదులు చేయడం, టీడీపీ వ్యూహాలను ముందే పసిగట్టి వాటికి విరుగుడు మంత్రాంగాలు చేయడం వంటి చర్యలు ఆయన సామర్థ్యాన్ని పట్టిస్తాయని అంటారు. 

ఇతర పార్టీల నాయకులను వైసిపిలోకి రప్పించడంలో ఆయన పాత్ర విశేషమైంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేర్పించిన ఘనత ఎక్కువగా ఆయనకే దక్కుతుంది. జగన్ వద్దకు నేరుగా వెళ్లి తమ సమస్యలను చెప్పుకోలేని వారంతా విజయసాయి రెడ్డి ఆశ్రయించే దాకా వెళ్లింది. అధినేతకు, పార్టీ నాయకులకు మధ్య ఆయన వారధిగా పనిచేస్తున్నారు