విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రెండోరోజూ విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న(బుధవారం) పలు విభాగాల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఇవాళ(గురువారం) ఇంజనీరింగ్ విభాగంతో పాటు టోల్ టికెట్లు, చీరల విభాగంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విభాగాల్లోని ప్రతి ఫైలునూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

దుర్గగుడిలో జరుగుతున్న అవకతవకలపై ఇప్పటికే అందిన పలు ఫిర్యాదులపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీల వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు  విజిలెన్స్ అధికారులు. ఇందులో భాగంగా ఆలయంలో పనిచేస్తున్న కీలక ఉద్యోగులను అదికారులు విచారిస్తున్నారు.

read more   దుర్గగుడిలో అక్రమాలు: అంతా ఈవోను చూసుకునే , ఏసీబీ నివేదికలో కీలకాంశాలు

దుర్గమ్మ గుడిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిన్న మొదలయ్యాయి. సెక్యూరిటీ శానిటరీ టెండర్లు అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అధికారులు ఈ దాడులు చేపట్టారు. ఆలయ ఈవో సురేష్ బాబు నుండి వివరాలు సేకరించారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి జెమ్మి దొడ్డి కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు జరుగాయి. స్టోర్స్, చీరల విభాగం, అన్నదాన విభాగంలో పలు ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. 

ఇక ఇప్పటికే బెజవాడ కనకదుర్గ ఆలయం అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రికార్డులతో పాటు ఏసీబీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దుర్గగుడిలో అక్రమాలకు, అవకతవకలకు ఈవో సురేష్ బాబు కారణమని ఏసీబీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు కనకదుర్గ గుడిలో సోదాలు నిర్వహించారు. అధికారులను, ఉద్యోగులను ప్రశ్నించారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణ జరిపారు. మూడు రోజుల పాటు తమ కసరత్తు సాగించిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరెలు సైతం మాయమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాము స్వాధీనం చేసుకున్న రికార్డులతో పాటు నివేదికను ప్రబుత్వానికి నివేదికను సమర్పిచారు. శానిటేషన్ టెండర్లలోనూ మాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్ లో కూడా లెక్కలు తేలలేదని ఏసీబీ అధికారులు చెప్పారు. 

అంతర్గత బదిలీలపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఏసీబీ అదికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తన పనిని పూర్తి చేశారు. తమకు ఫిర్యాదులు చేస్తే విచారణ జరుపుతామన ఏసీబి అధికారులు చెప్పారు.