బెజవాడ దుర్గగుడిలో అవకతవకలపై తుది నివేదిక సిద్ధం చేస్తోంది ఏసీబీ. ఆలయంలోని ఏడు విభాగాల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఏసీబీ.

ఇక ఈ కేసులో పలు అంశాల్లో వివరణ కోసం ఈవో సురేశ్ బాబును పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక నివేదికలో కొండపై అవకతవకలకు ఈవో తీరే కారణమని స్పష్టం చేసింది ఏసీబీ.

ఇక మరోవైపు ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మందిపై దేవాదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఈవో సురేశ్ బాబు స్టేట్‌మెంట్ తర్వాత ఏసీబీ తుది నివేదిక కీలకంగా మారనుంది. వేటు పడినవారిలో చీరలు, ప్రసాదాలు, అన్నదానం, స్టోర్‌ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులున్నారు.

దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదాలు, టికెట్లు‌, చీరల కౌంటర్లు, టోల్‌గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నివేదికలో వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు ఉన్న దుర్గగుడిలో ఈ స్థాయిలో అవినీతి వెలుగులోకి రావడం ప్రకంపనలు రేపుతోంది.