అమరావతి: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పార్క్ హయత్ లో జరిగిన భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలతో భేటీ అయిన విషయ తెలిసిందే. 

"ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు" అని విజయసాయి రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

 

"పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు" అని ఆయన అన్నారు.