ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నిప్పులు చెరిగారు.
కడప: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నిప్పులు చెరిగారు. తాను మొదటి నుంచి టీడీపీలో ఉన్నానని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఆదినారాయణరెడ్డి ఏడాది కిందట వచ్చారని ఆయన అన్నారు.
ఏడాది కిందట పార్టీలోకి వచ్చి మంత్రి పదవి పొందారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. తన ముందు ఆదినారాయణ రెడ్డి చాలా జూనియర్ అని అన్నారు. ఇటీవల ఆది రెండుసార్లు కమలాపురానికి వచ్చి నా ప్రస్తావన తీసుకురావడం ఏమిటని అడిగారు.
తనకు సీటు వస్తుందా, గెలుస్తారా అని అడగడం, మరొక నాయకుడి గురించి మాట్లాడుతూ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు, ఈసారి ఎలాగైనా ఆయనను గెలిపించాలని తన సహచరులతో చెప్పడం ఏమిటని అడిగారు.
ఆదినారాయణ రెడ్డి పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌చార్జి రామసుబ్బారెడ్డి ఒకసారి మినీ మహానాడు నిర్వహిస్తే అందుకు పోటీగా మంత్రి ఆదినారాయణరెడ్డి రెండవసారి మినీ మహానాడును నిర్వహించడం అభ్యంతరకరమని అన్నారు.
ఆది వ్యవహార శైలిపై ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికే కాకుండా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశామని చెప్పారు.
