హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్మీపార్వతి, హరికృష్ణ వంటి సొంత కుటుంబ సభ్యులే విమర్శిస్తున్నారని, అయినా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటూ బతుకుతున్న విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. 

దమ్ముంటే చంద్రబాబు విచారణను ఎదుర్కోవాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సవాల్ చేశారు. నీరు - చెట్టు కార్యక్రమం నిధులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టారని ఆమె ఆరోపించారు. 

తనది అవినీతి పాలన కాదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అత్యంత అవినీతిమయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రేదశ్ రెండో స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని, చంద్రబాబు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. 

తిరుమల శ్రీవారి ఆభరణాలను దోచుకునే పద్ధతికి తెర లేపారని రమణదీక్షితులు ఆరోపిస్తున్నారని, ఈ ఆరోపణపై సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. కోట్లాది మంది భక్తులున్న స్వామివారి విషయంలో చంద్రబాబు నోరు విప్పకుండా డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు .దేవుడిపై కూడా పెత్తనం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు .