విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీపై పట్టు సడలుతోందంటూ టిడిపి పొలిగ్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మాటలను బట్టి అర్థమవుతోందంటూ రామయ్య ట్వీట్ చేశారు. 

''ముఖ్యమంత్రి గారూ! రోజు రోజుకు పార్టీ మీద మీ పట్టు సడలి పోతుంది. మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు యధేచ్చగా బరి తెగించి మాట్లాడుతున్నారు. నిన్న, ఒక చానెల్ లో, మీ పార్టీ నాయకుడొకరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఇంటికి వచ్చి తంతానే, అని బెదిరించారు. మీ నాయకత్వ లేమి కన్పిస్తోంది కదూ?'' అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు. 

''దళిత వర్గాల ఓటు దండుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఆ దళితుల పైన యుద్ధం ప్రకటించారు. దళితుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యత పెంచే అమరావతి రాజధానిని, కాల రాస్తూన్నారు. 299 రోజులుగా ఉద్యమం చేస్తున్న దళిత రైతులను కూడ మీ ఇనుప పాదం క్రింద తొక్కుతున్నారు, న్యాయమా?''
 
''రాష్ట్రంలో పెద్ద "పజిల్" కు పరిష్కారం దొరకనుంది. రాజకీయ నాయకులపై కేసుల విచారణ, న్యాయస్థానంలో త్వరితగతిన పూర్తి కానున్న నేపథ్యంలో, అధికారంలో ఉన్న మన  "పెద్దల" భవిష్యత్తు అతి త్వరలో     "లోనా - బయటా" తేలనుంది. రాష్ట్ర ప్రజల అనుమానం పటాపంచలు కానుంది. అందరూ అప్రమత్తంగా ఇది గమనించాలి'' అంటూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు వర్ల రామయ్య.