పెను తుపానుగా మారుతున్న వార్ధనెల్లూరు జిల్లాపై అధిక ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధ వాయుగుండం తుపాను గా మారుతోంది. క్రమంగా తన దిశను మార్చుకుంటోంది.

ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు దిశగా 440 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 490 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుపాను రేపు మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అతి తీవ్ర తుపాను బలహీనపడే అవకాశం ఉన్నట్లు

అధికారులు చెబుతున్నారు.

కోస్తాంధ్రకు ఈరోజు సాయంత్రం నుంచి 36 గంటల పాటు వర్ష సూచన ప్రకటించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ముందు జాగ్రత్తగా కృష్ణపట్నం పోర్టులో ఆరో నంబర్‌, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబర్‌, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

తుపాను కారణంగా కోస్తాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.

ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులకు సమాచారం అందించి తీరానికి చేరుకోవాల్సిందిగా సమాచారం అందించారు. ఈ తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సహాయచర్యల కోసం 3 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి.