సిఎం రమేష్ పై టీడీపి నేత వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Varadarajulu Reddy makes comments aggainst CM Ramesh
Highlights

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత పోరు మరోసారి వీధికెక్కింది.

కడప: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత పోరు మరోసారి వీధికెక్కింది. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఇంచార్జీ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సిఎం రమేష్ కు లేదని ఆయన అన్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దయవల్లనే సిఎం రమేష్ రాజ్యసభ సభ్యుడయ్యారని ఆయన శనివారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సిఎం రమేష్ పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. సిఎం రమేష్ వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

సిఎం రమేష్ గ్రూపులు కట్టి చిచ్చు రేపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నామినేటెడ్ పదవులతో పబ్బం గడుపుకునే సిఎం రమేష్ కు వర్గ రాజకీయాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

వరదరాజులు రెడ్డికి, సిఎం రమేష్ కు మధ్య గత రెండేళ్లుగా వైరం కొనసాగుతోంది. ఆ వైరం రాజకీయపరమైందే కాకుండా వ్యాపారపరమైందని కూడా భావిస్తున్నారు. తనకు పోటీగా సిఎం రమేష్ లింగారెడ్డిని ప్రోత్సహిస్తున్నారని కోపం కూడా వరదరాజులు రెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రొద్దుటూరులోని కాకుండా కడప జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

loader