విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాదాకృష్ణ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు. నాదేండ్ల మనోహర్ ను ఆయన విజయవాడలోన ఓ హోటల్లో కలిశారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. 

తాజా రాజకీయ పరిణామాలపై వారి మధ్య జరిగినట్లు చెబుతున్నారు. ఇటీవల జనభేరిలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా జనేసనలో పవన్ కల్యాణ్ తర్వాతి స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

జనసేనలో చేరే ఉద్దేశంతోనే వంగవీటి రాధా నాదెండ్ల మనోహర్ ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో చిరంజీవి నాయకత్వలోని ప్రజారాజ్యం పార్టీలో కూడా వంగవీటి రాధా పనిచేశారు 2019 ఎన్నికలకు ముందు రాధా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. దాంతో రాధా జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది.

కాగా, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న వంగవీటి రాధా జగన్ తీరును తప్పు పడుతూ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన జనసేనవైపు అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు.