గుంటూరు: వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.అయితే దళిత ఓట్లతో గెలిచానన్న విషయం జగన్ మరవకూడదని అన్నారు.   

''బ్రిటీష్ కాలంలో బ్రిటిష్ వారికి ఎదురుతిరిగితే శిరో ముండనం చేయించేవారని చెప్పేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో ఆ పరిస్థితులే నెలకొన్నాయి. వందమంది నియంతలను ఒకవైపు ఉంచి మరో వైపు జగన్ ను ఉంచితే ఎలా ఉంటుందో ఊహించండి. అలా జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారు. జగన్ ని చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ధి అనిపిస్తోంది'' అని విమర్శించారు. 

''జగన్ 13 నెలల పాలనలోనే అనేక ఘోరాలు, నేరాలు జరిగాయి. ప్రత్యేకంగా దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. దళితుల హక్కుల గురించి ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధిస్తున్నారు.  బ్రిటీష్ కాలంలో  స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడి అసువులు బాశారో అలా  ఈ జగన్ రాజ్యంలో దళితులు అసువులు బాయాల్సిన పరిస్థితులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా వారి పని క్లోజ్ అనేలా నేటి పరిస్థితులున్నాయి'' అని అన్నారు. 

read more    సీతానగరం ఘటనపై జగన్ సీరియస్... ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

''మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడ్ని చేసి నడిబజార్లో తన్నుకుంటూ తీసుకెళ్ళి చంపాలని చూశారు. డాక్టర్ అనితారాణి తనకు న్యాయం చేయమని మాట్లాడితే అవిడను కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. జడ్జీ రామకృష్ణగారిని దాడులకు పాల్పడ్డారు.  పిచుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్లుగా తూ.గో జిల్లా సీతారామనగర్ లో వరప్రసాద్ అనే ఒక సామాన్య వ్యక్తిని ఇసుక దందాపై ప్రశ్నించినందుకు పోలీసుల చేత చెప్పుతో కొట్టించడమేకాకుండా శిరోముండనం చేయించడం దారుణం.  ఈ ఘటన జరిగిన వెంటనే  ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోయారు?'' అని ప్రశ్నించారు. 

''లోకేష్ బాబు ఈ విషయంపై ట్వీట్ చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించారు. చంద్రబాబునాయుడు దళితులను ఏమీ అనకపోయినా అన్నట్లుగా దుష్ర్పచారం చేసే  జగన్ వెనుక ఉన్న భజన బృందాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఇప్పుడు నోరెందుకు తెరవడంలేదు? ఈ ఘటనపై భాద్యత వహిస్తూ హోం మినిష్టర్ రాజీనామా చేయాలి. పదవులు కాపాడుకోవడానికి దళితులకు ద్రోహం చేస్తున్నారు'' అని అన్నారు. 

''125 అడుగుల దళితుల విగ్రహం కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అంబేద్కర్ 125 జయంతికి చంద్రబాబునాయుడు ఆల్ రెడీ ప్రపోజల్ పెట్టి ఉన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అవసరం లేదు గానీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి విలువివ్వండి చాలు. దళితులు సుఖంగా జీవించే అవకాశం కల్పిస్తే 125 కిలోల బంగారం ఇచ్చినట్లుగా దళితులు భావిస్తారు'' అని పేర్కొన్నారు. 

''మేకతోటి సుచరితకు హోం మినిష్టర్ పదవి అంబేద్కర్ బిక్షే. నేడు ఆమె తమ్ముడు రోడ్ల వెంబడి అధికారం, మంది మార్బలం, పోలీసులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్నారు. దళితులపై జరుగుతున్న దాడులు, వారిపై పెడుతున్న తప్పుడు కేసులు సహించలేక మనో వేదనను అనుభవిస్తున్నారు.  నెల రోజుల్లోనే 8 మంది దళితులపై అత్యాచారాలు జరిగితే ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. దళితులందరూ ఒక్కసారిగా తిరగబడితే వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది'' అని అనిత హెచ్చరించారు.