గుంటూరు: వైసీపీ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని... మద్యపాన నిషేదం అని చెప్పి మద్యరాత్రిళ్లు కూడా మద్యం అమ్ముతున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇది వరకు రాత్రి 8 గంటల వరకే  మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటే ఇప్పుడు అదనంగా ఇక గంట సమయం పొడిగించి రాత్రి 9 వరకు అనుమతులిచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు

''గొలుసు దుకాణాదారులు మహిళలకు కమీషన్లు ఇచ్చి వైన్ షాపు నుంచి మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. ఇలా మహిళలతో మద్యం వ్యాపారం చేయిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. విజయనగరం జిల్లా జామి మండలంలో గొలుసు దుకాణదారులు మహిళలను తీసుకువచ్చి సీసాకు ఇంతని కమిషన్ ఇచ్చి వారితో మద్యం కోనుగోలు చేయించి అమ్ముకుంటున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వానికి కనిపించటం లేదా?'' అని నిలదీశారు. 

read more  కరోనా టెస్టుకోసం వచ్చి కొడుకు మృతి...కంటతడి పెట్టించిన తండ్రి రోదన (వీడియో)

''రాష్ట్రంలో వైసీపీ నేతలే మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలించి అధిక రేట్లకు అమ్ముతున్నారు. వాలంటీర్లు, వైసీపీ నాయకులే  గ్రామాల్లో నాటుసారా తయారీ చేసి విక్రయిస్తున్నారు'' అని  ఆరోపించారు.  

''చంద్రబాబు పాలనలో పంటపొలాల్లో పట్టిసీమ జలాలు పారితే, జగన్ పాలనలో పట్టణాల నుంచి పల్లెవరకు మద్యం ఏరులై పారుతోంది. రాష్ర్టంలో  పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?  కమీషన్లు ఇవ్వలేదని నాణ్యమైన బ్రాండ్లు ఉత్పత్తి చేసే డిస్టలరీలకు ఆర్డర్లు నిలిపివేసి...కేసుకు 10 శాతం చొప్పున కమీషన్లు తీసుకుని నకిలీ బ్రాండ్లకు అనుమతిలిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జగన్ ప్రభుత్వం అమ్ముతున్న కొత్త బ్రాండ్లు తాగేవారికే కాదు గూగుల్ కి కూడా తెలియటం లేదు'' అని ఎద్దేవా చేశారు. 

''జలగ రక్తం తాగినట్లు జగన్  మద్యం రేట్లు 90 శాతం పెంచి పేదల రక్తం తాగుతున్నారు. గతేడాది ఎక్సైజ్ రాబడి రూ.6,220 కోట్ల నుండి రూ.6,536 కోట్లకు పెరిగింది. 90 శాతం ధరల పెంచి త్రాగేవారిపై  రూ.9 వేల కోట్లు బారం మోపారు. దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని చెప్పి దశలవారీగా రేట్లు పెంచారు. మందుకు అలవాటుపడిన వారు మద్యం మానలేక, పెరిగిన రేట్లతో మద్యం కొనలేక స్పిరిట్  త్రాగి 7 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు దిక్కెవరు?'' అని నిలదీశారు. 

''సామాన్యుడి దినసరి కూలీ మొత్తం త్రాగుడుకే ఖర్చయ్యేంతలా మద్యం రేట్లు పెంచారు. ఇక వారు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు? వైసీపీ ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ద్యాస తప్ప  ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం శ్రద్ద లేదు. ముఖ్యమంత్రి అక్రమ మద్యంపై దృష్టి పెట్టి నివారణకు చర్యలు తీసుకోవాలి.  కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల కోసం ఆలోచించాలి'' అని అనిత సూచించారు.