విశాఖపట్నం: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సోమవారం ఉదయం విశాఖపట్నంలో వంచన వ్యతిరేక దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 

ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న తమ పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు ఏం చెప్పారో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. 

గత నాలుగేళ్లుగా తాను మోసం చేశానని భగవంతుడికి క్షమాపణ చెప్పి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తే అర్థం ఉంటుందని అన్నారు. మోడీ, చంద్రబాబు ఇద్దరు కూడా హోదా ఇవ్వకుండా చేశారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తే తమపై కేసులు పెట్టారని, ఇప్పటికీ తాము కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. 

తెలుగు ప్రజలు అమాయకులు కారని, మోడీ అయినా చంద్రబాబు అయినా వ్యతిరేకిస్తారని అంబటి రాంబాబు అన్నారు. మోడీ బాగా చేస్తున్నారని, ప్రత్యేక హోదా అవసరం లేదని ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటున్నారని, పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని ఆయన అన్నారు. 

మోసపూరితమైన, కుట్రపూరితమైన పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తాము మొదటి నుంచీ ప్రత్యేక హోదా కావాలనే అంటున్నామని ఆయన చెప్పారు. ఇంతకు ముందు చేసిందంతా మోసమని చెప్పి చంద్రబాబు దీక్ష చేపట్టాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటం సందర్భంగా తమపై పెట్టిన కేసులను ఎత్తేసి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నారు.