సీఎం జగన్‌ దగ్గర గన్నవరం పంచాయితీ ముగిసింది. వైసీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. సుధీర్ఘ చర్చ అనంతరం పార్టీ బలోపేతానికి పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావుకు జగన్‌ సూచించారు.

ఈ భేటీలో యార్లగడ్డకు తన రాజకీయ భవిష్యత్తుపై జగన్ హామీ ఇచ్చినట్లు సమచారం. దీంతో వెంకట్రావు మెత్తపడినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశం తర్వాత పేర్నినాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావు ఒకే కారులో వెళ్లిపోయారు. గన్నవరం పంచాయతీకి జగన్ ముగింపు పలకడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చకున్నాయి.

ఇటీవల తనను రాజకీయంగా ఎదుర్కోలేక యార్లగడ్డ వెంకట్రావు, రవికుమార్‌ అనే వైసీపీ సానుభూతిపరుడితో కలిసి తనపై.. ఇళ్ల పట్టాలు ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేశారని వంశీ ఆరోపించారు.

Also read:మంత్రి గంటాకు షాక్: ఆస్తుల వేలానికి రంగం సిద్ధం, వేలంలో ఇల్లు కూడా.....

ఇళ్ల పట్టాల కాపీని తహసీల్దార్‌ మెయిల్‌కు రవికుమార్‌ పంపగా ఆ కాపీని తహసీల్దార్‌ పోలీసుస్టేషన్‌లో ఇచ్చి తనపై ఫిర్యాదు చేశారని వల్లభనేని తెలిపారు. పోలీసులు కూడా ఎలాంటి విచారణ లేకుండా కేసు నమోదు చేశారని వివరించారు.

ఇందులో కుట్ర కోణం దాగుందని, పూర్తి ఆధారాలను తాను సేకరించానని వాటిని గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేస్తానని వంశీ వెల్లడించారు. యార్లగడ్డను టార్గెట్ చేస్తూ ఆరోపణలను గుప్పించిన వంశీ, ఆయనతో కలిసి వైసీపీలో సమైక్య రాగం ఆలపిస్తారా? లేక వేరు కుంపట్లతో వైసీపీకి తలనొప్పి అవుతారో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లడం ఖరారు కావడంతో గన్నవరం నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒడిన యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. వంశీ వైసీపీలోకి వస్తే తన భవిష్యత్తేమిటని యార్లగడ్డ వాపోతున్నారు. 

Also Read:వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ

ఈ నేపథ్యంలో జగన్ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాలని వంశీకి కండిషన్ పెట్టాడు. వంశీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్టు నిన్న రాత్రి నుంచే వార్తలు వస్తున్నాయి. 

వంశీ రాజీనామాతో ఖాళీ అయ్యే గన్నవరం సీటును యార్లగడ్డకు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇరువురినీ కూడా జగన్ ఒప్పించారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందాడు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే గన్నవరం నుండి మరో మారు యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగనున్నారు.