విశాఖపట్నం: మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు మరో ఎదురుదెబ్బ తగిలనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా శ్రీనివాసరావుకు బ్యాంకు షాక్ ఇచ్చింది. 

గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 20న వేలం వేస్తామని అప్పటి వరకు తీసుకున్న రుణాలు చెల్లించాలని వార్నింగ్ ఇచ్చింది. గంటా శ్రీనివాసరావు మంత్రిగా పనిచేస్తున్న హయాంలో రుణాలు తీసుకుని ఆ నాటి నుంచి చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఇప్పటి వరకు చెల్లించకపోవడాన్ని ఇండియన్ బ్యాంకు తీవ్రంగా తప్పుబట్టింది. ఇకపోతే ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బకాయిలు సుమారు రూ.209 కోట్లుగా బ్యాంకులు తేల్చేశాయి.

ఆ సొమ్ము కోసం రూ.35 కోట్ల 35 లక్షల 61వేలు విలువ చేసే ఆస్తులు తనఖా పెట్టారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతోపాటు మిగిలిన బకాయిల కోసం వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇకపోతే వేలానికి రానున్న ఆస్తుల్లో గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఒక ప్లాట్ కూడా ఉంది.

ఇకపోతే ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీ రుణాలు తీసుకున్నారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని బ్యాంకు ఖండించింది. ఆ ఆరోపణలు ఈ రుణానికి సంబంధించినవి కాదని ఇండియన్ బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. 

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కు సైతం ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది ఆంధ్రాబ్యాంకు. శ్రీభరత్ సైతం పవర్ ప్లాంట్ కు సంబంధించి రుణాలు తీసుకుని కొంతకాలంగా చెల్లించకపోవడంతో ఆంధ్రాబ్యాంకు ఆయన ఆస్తుల వేలానికీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. 

తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ లకు బ్యాంకు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా పార్టీకి అండగా ఉంటున్న నేతలకు ఇలాంటి సమస్యలు ఎదురవ్వడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గంటాతో ఆపరేషన్: అసెంబ్లీలో టీడీపీ మాయం, బిజెపియే ప్రతిపక్షం?

బాలకృష్ణ చిన్నల్లుడికి జగన్ ఝలక్: బొత్స తెచ్చిన తంటా

చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం