ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్ పెను దుమారాన్ని రేపుతోంది. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని వంశీ చెప్పడంతో గన్నవరంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

వల్లభనేని రాకను ఆయన ప్రత్యర్ధి స్థానిక వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో యార్లగడ్డ వెంకట్రావ్, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని భేటీ అయ్యారు.

సీఎం స్పందనను బట్టి తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెంకట్రావ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీ వ్యవహారంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 

Also read:అనర్హత భయంతోనే... జగన్‌పై అభిమానంతో కాదు: వంశీ చేరికపై యార్లగడ్డ నిప్పులు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లడం ఖరారు కావడంతో గన్నవరం నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒడిన యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. వంశీ వైసీపీలోకి వస్తే తన భవిష్యత్తేమిటని యార్లగడ్డ వాపోతున్నారు. 

ఈ నేపథ్యంలో జగన్ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాలని వంశీకి కండిషన్ పెట్టాడు. వంశీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్టు నిన్న రాత్రి నుంచే వార్తలు వస్తున్నాయి. 

వంశీ రాజీనామాతో ఖాళీ అయ్యే గన్నవరం సీటును యార్లగడ్డకు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇరువురినీ కూడా జగన్ ఒప్పించారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందాడు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే గన్నవరం నుండి మరో మారు యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగనున్నారు. 

Also Read:వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డకు జగన్ హామీ ఇదే

వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జగన్ వంశీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వంశీ వైసీపీలో చేరుతున్నారంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం లేదని పలువురు కార్యకర్తలు చెప్పారని ఈ విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేస్తానని యార్లగడ్డ వెల్లడించారు.

పదేళ్లు పార్టీ జెండా పట్టుకుని మోసినప్పుడు ఎవరిపై పోరాటం చేశామో, ఎవరైతే ఇబ్బందులకు గురిచేశారో వారిని పార్టీలోకి చేర్చుకోవడం సరికాదంటున్నారు. అదే సమయంలో బాలవర్థనరావు లాంటి నిజాయితీ గల వ్యక్తి పార్టీలో చేరితే స్వాగతించిన విషయాన్ని వెంకట్రావు గుర్తు చేశారు.