విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా మారిన వంశీకి నియోజకవర్గంలో పరిస్థితి వ్యతిరేకంగా మారుతోంది నియోజకవర్గంలో వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు ఓ వైపు, దుట్టా రామచందర్ రావు మరో వైపు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే వంశీకి సవాళ్లు విసురుతున్నారు. 

నియోజకవర్గంలో పరిస్థితి తనకు సానుకూలంగా లేకపోవడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయాల పట్ల ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని తన ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలను వైసీీప అధిష్టానం చూస్తూ ఊరుకుంటోందని, సయోధ్యకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జగన్ పేరు చెప్పి ఇతర నాయకులు తనపై పోరాటానికి దిగడం ఆయనకు మింగుడు పడడం లేదని అంటున్నారు.

అందరినీ కలుపుకుని వెళ్లడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన అన్నారు. కొందరు గొడవలు సృష్టించి తనపై బురద చల్లుతున్నారని వంశీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత యార్లగడ్డ వెంకటరావు గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చారు. గన్నవరం శాసనసభ నియోజకవర్గం వివాదంపై ఆయన స్పందించిన విషయం తెలిసిందే. గన్నవరం నియోజకవర్గంలో తనకు గ్రూపులు లేవని ఆయన స్పష్టం చేశారు.  తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆయన అన్నారు. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పనిచేయబోనని తాను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెప్పినట్లు ఆయన తెలిపారు. వంశీ తనను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన చెప్పారు. వంశీ వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.      

తన జన్మదిన వేడుకలు జరపకూడనది పలు గ్రామాల్లో కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, మంత్రి ఒత్తిడి ఉందని చెబుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 

కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు కార్యకర్తల కోసం తాను ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.. గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన వంశీ ఆ తర్వాత తన విధేయతను మార్చారు. వైసీపీకి అనుకూలంగా మారారు. అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. వంశీని యార్లగడ్డ వెంకటరావు మాత్రమే కాకుండా నియోజకవర్గంలో దుట్టా రామచందర్ రావు కూడా వ్యతిరేకిస్తున్నారు.