అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. దేశంలో శాంతియుతంగా, నిరాటంకంగా ఆందోళన కొనసాగించింది ఒక్క అమరావతి రైతులు మాత్రమేనని పేర్కొన్నారు. 

రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన ఆందోళన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా జయభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొన్న శోభనాద్రీశ్వరరావు కలలో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. 

అమరావతి రాజధానికి 1500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందన్నారు. అయినా రాజధాని రైతుల త్యాగం వృధా పోదన్నారు. రాజ్యాంగమే రైతులకు రక్షగా ఉంటుందని... తుగ్లక్ నిర్ణయాలు న్యాయస్థానాల ముందు చెల్లవన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా రాజధానిని తరలించలేదని... జనవరి లోపల రైతులు తీపి కబురు వింటారని శోభనాద్రీశ్వరరావు అన్నారు. 

read more  జనభేరి సభకు వెళ్లేందుకు... మీ రూటు మార్చండి: చంద్రబాబుతో పోలీసులు

ఇదే సభలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... అభివృద్ధి ముసుగు వేసుకొని ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కుటిల రాజకీయ నీతిని ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ఏకాభిప్రాయంతో ప్రారంభించిన రాజధానిని ఎలా మారుస్తారు? శాసనసభలో ఆమోదించిన తరువాత రాజధానిని మారిస్తే ఆ సభకు గౌరవం ఏంటి ? అని ప్రశ్నించారు.  రాజధాని తరలింపును ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని లక్ష్మీ నారాయణ సూచించారు.