అమరావతి: గురువారం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రాజధాని రైతుల ఆందోళనలు ఏడాదికి చేరిన నేపథ్యంలో జనభేరి పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ  సభలో పాల్గొనడానికి ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ ను చివరి నిమిషాల్లో పోలీసులు మార్చారు. 

ఉద్దండరాయుని పాలెం మీదుగా జనభేరి సభకు వెళతానంటూ చంద్రబాబు కోరిన రూట్ మ్యాప్ కు అనుమతి నిరాకరించారు పోలీసులు.  దుర్గ గుడి, ఉండవల్లి సెంటర్,పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి సభకు వెళ్లేలని పోలీసులే ఓ రూట్ మ్యాప్ ను చంద్రబాబు కు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ రూట్ లో వెళతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఈ క్రమంలోనే అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి  వెళ్ళ కుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కాకుండా ఒంటరిగా అయినా శంకుస్థాపన స్థలానికి వెళతానని చంద్రబాబు కోరినా పోలీసులు అనుమతించడంలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

రాజధాని రైతుల ఆందోళనలు ఏడాదికి చేరిన నేపథ్యంలో నిర్వహిస్తున్న జనభేరి సభకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తో పాటు కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు, బిజెపి నేతలు హాజరు అవుతున్నారు. ఇలా రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో పాటు భారీగా రాజధాని రైతులు హాజరు అవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2200మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.