తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ పసికందును బతికుండగానే పూడ్చిపెట్టారు గుర్తు తెలియని దుండగులు. ఎటపాక మండలం కృష్ణవరంలో శనివారం కేవలం కొన్ని గంటల కిందటే పుట్టిన బాబును పూడ్చిపెట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే బిడ్డ ఏడుపు వినిపించిన స్థానికులు ఆ ప్రాంతంలో వెతకడంతో పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానంతో వెంటనే తవ్విచూడగా.. బాబు కనిపించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.

బిడ్డ బతికే ఉండటంతో లక్ష్మీపురం ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబును పూడ్చిపెట్టిన ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిడ్డను పూడ్చి పెట్టిన వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.