ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పారిశ్రామికవేత్తలతో చర్చ ప్రయోజనకరంగా జరిగింది. కొత్త ప్రభుత్వం ప్రత్యేకహోదాపై వాస్తవ దృక్పథంతో ఉంటుందని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఓసారి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు తగినట్లుగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీకి ఎంతసాయం చేయాలో అంతా చేశామని.. కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నా పునర్విభజన చట్టంలోని ప్రయోజనాలకు మంచి సాయం చేశామని గోయెల్ తెలిపారు.

మంచి ప్యాకేజీలను ఇచ్చామని.. ఇలా చర్చల అనంతరం గత ప్రభుత్వం ఆ ప్యాకేజీలను అంగీకరించి పొగిడిందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ అంశంలో టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు చేసిందని పీయూష్ గోయెల్  ఆరోపించారు.

మరో వైపు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి చెప్పడం శుభపరిణామమన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను జిల్లాల వారీగా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని.. దీనిపై వైసీపీ రాజకీయ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని గౌతమ్ తెలిపారు.