ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తేల్చిచెప్పారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై (ap special status) మరోసారి కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. దీనిపై కేంద్రమంత్రి నిత్యానందరాయ్ (union minister nityanand rai) పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లోక్‌సభలో టీడీపీ (tdp) ఎంపీ రామ్మోహన్ నాయుడు (rammohan naidu) అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానం తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. అయితే విభజన చట్టంలో మరికొన్ని హామీలు మాత్రం మిగిలే వున్నాయని కేంద్రం అంగీకరించింది. రానున్న రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. 

కాగా... యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో పలు అంశాలను ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (ap bifurcation act 2014) కూడా తీసుకువచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్టుగా తెలిపంది. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆనాడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా భాగస్వామ్యమైంది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఏపి ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది. 

ALso REad:ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: మోడీకి జగన్ వినతి

అయితే ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని తీసుకున్న టీడీపీపై ఆనాడు విపక్షంలో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహింంచింది. జనసేన పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎన్డీఏకు దూరమైంది. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి అన్యాయం చేశారని మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. మోడీ సర్కార్ పై అవిశ్వాసం కూడా పెట్టింది. అయితే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతూనే వున్నారు. 

ఇకపోతే.. 2019 ఎన్నికల సమయంలో కూడా ప్రత్యేక హోదా ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. అయితే కేంద్రంలో బంపర్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రత్యేక హోదా విషయమై కేంద్రానికి ఏపీ సీఎం జగన్ పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. కానీ కేంద్రం నుండి ఈ విషయమై సానుకూల స్పందన లేదు. ఈ తరుణంలో ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానికి మరోసారి సీఎం జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. విభజనతో Andhra Pradesh రాష్ట్రం పూర్తిగా దెబ్బతిందని జగన్ చెప్పారు. విభజనతో దెబ్బతిన్న ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ఆ వినతి పత్రంలో కోరారు.

మరో వైపు Polavaram ప్రాజెక్టు అంశాన్ని కూడా జగన్ ఈ వినతి పత్రంలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.ఈ నిధులను అందించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. అంతేకాకుండా Telangana రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల నుండి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలను వచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీ విద్యుత్ సంస్థలకు రూ.6,627.28 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలకు ఆర్ధిక సహాయం చేయాలని జగన్ ఆ వినతి పత్రంలో కోరారు.