ముగిసిందనుకున్న ‘వాడరేవు’ కథ.. స్థలం ఇవ్వండి పోర్టు నిర్మిస్తామన్న గడ్కరీ

union minister nitin gadkari proposes major port at Vadarevu in Andhra Pradesh
Highlights

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ‘దుగరాజపట్నం’లో పోర్టు కుదరదని ఇప్పటి దాకా వాదిస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం.. తాజాగా వాడరేవులో అయితే పోర్టుకు ఓకే నంటూ రాష్ట్రప్రభుత్వానికి అంగీకారం తెలిపింది

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ‘దుగరాజపట్నం’లో పోర్టు కుదరదని ఇప్పటి దాకా వాదిస్తూ వచ్చిన కేంద్రప్రభుత్వం.. తాజాగా వాడరేవులో అయితే పోర్టుకు ఓకే నంటూ రాష్ట్రప్రభుత్వానికి అంగీకారం తెలిపింది. ఈ మేరకు విశాఖలో  జరిగిన సభలో కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణా, పోర్టుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు..

దేశంలో పోర్టులను కలుపుతూ రైలు, రోడ్డు మార్గాలను నిర్మించేందుకు ఉద్దేశించిన ‘సాగరమాల’ ప్రాజెక్ట్ కింద రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని.. ఇందులో ఇప్పటికే రూ.4.5 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తి  అయ్యాయాని గడ్కరీ తెలిపారు. దేశంలో సుమారు 18 శాతం మంది జనాభా సముద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారని.. అందువల్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

విశాఖ పోర్టులో కార్యకలాపాలు ప్రస్తుతం సంతృప్తి స్థాయికి చేరుకున్నాయని.. దీని విస్తరణకు లేదా సమీపంలో  మరో పోర్టు ఏర్పాటుకు స్థలం అందుబాటులో లేదని.. దీంతో కొత్త పోర్టు నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని.. ఈ నేపథ్యంలో వాడరేవులో మూడు వేల ఎకరాలు కేటాయిస్తే అక్కడే కొత్త పోర్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రిగా లేఖ రాస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్‌లో సాగరమాల ప్రాజెక్ట్ కింద రూ.1.5 లక్షల కోట్లను రహదారులకు, రూ.లక్ష కోట్లు నీటి మార్గాలకు ఇస్తున్నామన్నారు. ప్రైవేట్ పోర్టుల పోటీని తట్టుకునేందుకు ట్రేడర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చే అధికారాన్ని విశాఖ పోర్టు ఛైర్మన్‌కు ప్రత్యేక అధికారాన్ని ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.. అలాగే విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటుపరం చేయడం కానీ.. పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం కానీ ఉండదని గడ్కరీ స్పష్టం చచేశారు..

వచ్చే నెల నుంచి ముంబై- గోవా మధ్య క్రూయిజ్ ప్రారంభమవుతుందని... విశాఖపట్నంలో క్రూయిజ్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని పోర్టు ఛైర్మన్ కృష్ణబాబుకు తెలిపారు.. అలాగే..ముంబై తీరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తున్నామని.. విశాఖపట్నంలోనూ అటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు

. కాగా, వాడరేవులో రేవు ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ‘వాన్‌పిక్’ ( వాడరేవు-నిజాంపట్నం పోర్ట్, ఇండస్ట్రీయల్ కారిడార్) ఏర్పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో ‘వాన్‌పిక్’ పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసింది... ప్రభుత్వం కూడా తన వంతుగా ప్రజల వద్ద నుంచి భూములు సేకరించి ఇచ్చింది.

అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ ప్రమోటర్లు కూడా నిందితులు కావడం.. భూముల కేటాయింపు, కొనుగోళ్లలో అక్రమాలు జరగడంతో ‘వాడరేవు’ ప్రాజెక్ట్ అటకెక్కింది.. అయితే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం వాన్‌పిక్ భూముల స్వాధీనానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే న్యాయస్థానంలో విచారణ జరుగుతుండటంతో మిన్నకుండిపోయింది..

ఇలాంటి పరిస్థితుల్లో గడ్కరీ ప్రకటనతో వాడరేవు మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది. వీలైనంత త్వరగా రాష్ట్రప్రభుత్వం కనుక 3 వేల ఎకరాలు సేకరించి ఇస్తే.. వాడరేవు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
 

loader