అమరావతి: రాజధానుల నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ మేరకు ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ను గురువారం నాడు దాఖలు చేసింది.

చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని స్ఫష్టం చేసింది కేంద్ర హోంశాఖ.రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్రం పరిధిలోనిదా, రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్ పై కేంద్ర హోంశాఖ ఈ కౌంటర్  అఫిడవిట్ దాఖలు చేసింది.

also read:అమరావతికి జై కొడితే రాజీనామాలకు సై: బాబు ప్లాన్ ఇదీ...

రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశంగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజధానుల నిర్ణయంపై కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

2014 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. 

ఈ మేరకు పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు చట్టాలను చేసింది. అయితే ఈ విషయమై  అమరావతికి చెందిన రైతులు కొందరు కోర్టులను ఆశ్రయించారు. అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

రాజధాని నిర్ణయంపై సుమారు 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గతంలోనే కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశించింది.దీంతో ఇవాళ కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. మరో వైపు ఈ విషయమై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ సాగనుంది.