Asianet News TeluguAsianet News Telugu

అమరావతికి జై కొడితే రాజీనామాలకు సై: బాబు ప్లాన్ ఇదీ...

అమరావతిలోనే రాజదానిని కొనసాగిస్తామని చెబితే తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ ప్రకటనతో మరోసారి రాజీనామాల అంశం ఇంకా ఏపీ రాజకీయాల్లో చర్చ కొనసాగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
 

Chandrababu strategy on resignations over three capital cities issue
Author
Amaravathi, First Published Aug 5, 2020, 6:18 PM IST


అమరావతి: అమరావతిలోనే రాజదానిని కొనసాగిస్తామని చెబితే తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ ప్రకటనతో మరోసారి రాజీనామాల అంశం ఇంకా ఏపీ రాజకీయాల్లో చర్చ కొనసాగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఎన్నికల ముందు అమరావతి నుండి రాజధానిని మార్చమని వైసీపీ హామీ ఇచ్చింది. అయితే ఎన్నికల తర్వాత మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరమీదికి తీసుకొచ్చింది. అమరావతికి ప్రజల ఆమోదం ఉందనుకొంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు రెండు రోజుల క్రితం జగన్ కు సవాల్ విసిరారు. 

రెండు రోజుల గడువు బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలతో పూర్తైంది. చంద్రబాబు డిమాండ్  విషయంలో వైసీపీ ఎదురు దాడికి దిగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని భావిస్తే తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిదులతో రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ టీడీపీని డిమాండ్ చేసింది.

ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయమై ప్రజలకు చంద్రబాబునాయుడు వివరించే ప్రయత్నం చేయనున్నారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామంటే రాజీనామాలకు తాము సిద్దమని చంద్రబాబు ఇవాళ ప్రకటించి బంతిని జగన్ కోర్టులోకి నెట్టారు. 

ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా ఉప ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదు.అయినా కూడ రాజీనామాలకు సిద్దమేనని బాబు సవాల్ విసిరారు. 

also read:ముగిసిన డెడ్‌లైన్, జగన్ పారిపోయాడు: అమరావతికి సై అంటే రాజీనామాకు బాబు సై

మూడు రాజధానులకు ఏర్పాట్లు చేసుకొంటున్న ప్రభుత్వం వెనక్కు వెళ్లే అవకాశం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామని వైసీపీ ప్రకటించే అవకాశాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు రాజీనామాలకు సై అన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అమరావతి విషయంలో వైసీపీ నేతలు గతంలో ఏం మాట్లాడారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయాలను కూడ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడ ఆ పార్టీ భావిస్తోంది. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలి... భవిష్యత్తులో ఏ రకమైన నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాలను కూడ ప్రజలకు వివరించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.

అమరావతి అస్త్రాన్ని ఉపయోగించుకొని జగన్ ప్రభుత్వంపై విమర్శలను తీవ్రం చేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఈ విషయంలో టీడీపీ ప్లాన్ ఏ మేరకు విజయవంతం కానుందో కాలమే నిర్ణయిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios