అమరావతి: ఏపీ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తుల నుండి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ సచివాలయంలోని పౌరసరఫరాల శాఖలో డేటా ఎంట్రీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామనే పేరుతో  దందాకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

సివిల్ సప్లయిస్ కన్యూమర్స్ అఫైర్స్ ఆఫీసులో ఉద్యోగం పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన విషయం వెలుగు చూసింది.ఏగయ్య అనే యువకుడి వద్ద నుండి నిందితులు రూ.3.30 లక్షలు వసూలు చేశారు.

ఏపీ మంత్రి కొడాలి నాని  ఓఎస్డీ పేరుతో బాధితుడికి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ పంపారు. ఏగయ్యకు ఉద్యోగం ఇవ్వాలని కూడ సివిల్ సప్లై శాఖ అధికారికి నకిలీ పత్రాలు కూడ పంపించారు.

మంత్రి పీఎస్ పేరుతో లెటర్ ప్యాడ్, స్టాంప్ వేసి అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు. లెటర్ ను తీసుకొన్న బాధితుడు సెక్రటేరియట్ వచ్చి విచారిస్తే తాను మోసపోయినట్టుగా తేలింది. 

ఈ విషయమై బాధితుడు వెంటనే తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.