రాజమండ్రి: రాష్ట్ర విభజనపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా  ప్రజల్లో విప్లవం వస్తుందని భావించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు, రాజకీయ నాయకులు కూడా పట్టించుకోలేదని అన్నారు. 

చంద్రబాబు, జగన్‌, పవన్‌లకు చెప్తే తొలుత సరేనన్నారని, తర్వాత పట్టించుకోలేదని,, అందుకు ఏవో కారణాలు ఉండవచ్చునని ఉండవల్లి అన్నారు. తాను రాజకీయాల్లోనే ఉన్నట్లు, చాలా చురుగ్గా ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు సార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇంత రాజకీయం చేయలేదని, వచ్చే ప్రభుత్వంలోని తప్పులను కూడా ఎత్తి చూపుతాననిస పబ్లిక్‌ స్పోక్స్‌మన్‌గా ఉంటానని ఆయన అన్నారు. 

రాజమహేంద్రవరంలో సోమవారం రాత్రి "వైఎస్ఆర్‌తో ఉండవల్లి" పుస్తకంపై జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసినా కూడా తనపై ఆరోపణలు ఏమీ రాలేదని ఆయన చెప్పుకున్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధిలో తన పాత్ర ఉందని, కానీ నేను చెప్పుకోనని అన్నారు. చేసినవి చెబితే, చేయనవి కూడా ఎందుకు చేయలేదో చెప్పాలికదా అని ఆయన అన్నారు. ఎంపీ ల్యాడ్స్‌ వినియోగంలో దేశవ్యాప్తంగా 9 మందిని నెం.1 స్థానానికి ఎంపిక చేస్తే అందులో తాను ఒక్కడినని ఆయన అన్నారు..
 
వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఫోన్‌లో మాట్లాడితే పనులు జరిగేవని, ఆయన మృతి చెందిన తర్వాత తాను ఆసక్తి చూపలేదని ఉండవల్లి అన్నారు. వైఎస్‌ కూడా తనను ఎందుకో విశ్వసించారని, జక్కంపూడి చెప్పడం వల్లనో, ఇంకేదో కారణం కావచ్చునని అన్నారు. ఏసీవై రెడ్డిని కాదని తనకు ఎమ్మెల్యే సీటు, చిట్టూరి రవీంద్రను కాదని ఎంపీ సీటు ఇచ్చారని ఆయన అన్నారు.