రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేవుడున్నాడని వైఎస్ జగన్ తరుచుగా అంటుంటారని, ఇప్పుడు జగన్ ను ఆ దేవుడే ఆశీర్వదించాలని ఆయన అన్నారు వైఎస్ జగన్ కు ఆయన బుధవారం బహిరంగ లేఖ రాశారు. 

రాజశేఖర రెడ్డి తనయుడు మాట తప్పడు... మడమ తిప్పడు అనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని, ఇప్పుడు జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబడి తీవ్రంగా పడిపోయిందని, కేంద్ర ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన అన్నారు. 

కేంద్రం నుంచి రావాల్సినవి రావడం లేదని, ఇక్కడ ఆదాయం కూడా ఏమీ లేదని ఆయన అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలోనే హెచ్చరించారని, ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉందని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. 

కాగా, ఆయన సరికొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకుని వచ్చారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన వైఎస్ జగన్ కు లేఖ రాశారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేది దివంగత రాజశేఖర రెడ్డి కోరిక అని ఆయన చెప్పారు. 

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమ, రాజమండ్రిల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయడానికి అంగీకరించిన విషయాన్ని ఆయనయ గుర్తు ేచశారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.