రాజమహేంద్రవరం: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పోడు అంటూ కితాబిచ్చారు. 

రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి జగన్ పాదయాత్రకు జనం వస్తున్న తీరును చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఏపీలో మెట్టమెుదటి సారిగా పాదయాత్ర చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయనకు కూడా విపరీతంగా జనం వచ్చేవారని గుర్తు చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారని కానీ ఆయన పాదయాత్ర ఆరంభం నుంచి పేలవంగా సాగిందన్నారు. వందల సంఖ్యలో మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు.

కానీ ప్రస్తుతం వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ మంది హాజరవుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఎప్పటికప్పుడు అధికార పార్టీని విమర్శించడంలో జగన్ సక్సెస్ అవుతున్నాడని తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ఇంతలా ఏనాడు మాట్లాడలేదన్నారు. జగన్ మంచి స్పీకర్ అంటూ కితాబిచ్చారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ దూసుకెళ్తున్నారని చెప్పారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కంటే జగన్ గొప్పోడంటూ చెప్పుకొచ్చారు. 

మరోవైపు వైఎస్ ఆర్ కొడుకుగా పుట్టడం జగన్ కు గొప్ప వరం అంటూ కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం దేవుడు అయిపోయాడని ఆ దేవుడి కుమారుడిగా ప్రజలు జగన్ ను ఆదరిస్తున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ప్రజల నుంచి వస్తున్న ఆదరణను జగన్ క్యాష్ చేసుకోవాలని సూచించారు.

గత ఎన్నికల్లోనే వైఎస్ జగన్ సీఎం అవ్వాల్సి ఉండేదని అయితే ఆయన కొన్ని తప్పటడుగులు వేశారని చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తే జగన్ గెలుపు సాధ్యమేనని చెప్పుకొచ్చారు. 

మరోవైపు పలు సూచనలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయోద్దని తెలిపారు. దుర్యోధనుడిలా పోరాడతారంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరో ఒకరిని బరిలోకి దింపుతారని చెప్పారు. ఓడిపోతామని తెలిసినా చివరి వరకు చంద్రబాబు పోరాడతారని అది చంద్రబాబు నైజమన్నారు. 

జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబును ఓడించగలం అని ధీమాతో ఉండకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. లేని పక్షంలో ఆఖరినిమిషంలో ఎవరో ఒక అశ్వత్థామను దింపుతారని చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు ఆలోచన వల్లే తెలంగాణ ఎన్నికల్లో దెబ్బ: ఉండవల్లి