రాజమహేంద్రవరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతప్రతాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. శ్వేతపత్రాలు సత్యదూరమంటూ కొట్టిపారేశారు. అన్ని రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చెయ్యలేదని ప్రశ్నించారు. 

రాజమహేంద్రవరంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ 60సి అడ్డుపెట్టుకుని పోలవరం వేల కోట్లు రూపాయల పనులు అడ్డదిడ్డంగా కట్టబెడుతున్నారని విమర్శించారు. శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్ ఈడీ బల్బులు కాంట్రాక్టులో భారీ దోపిడీ కనిపిస్తోందన్నారు. 

చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. టీడీపీ నేతలు తన సవాల్ ను స్వీకరించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై సెటైర్లు వేశారు ఉండవల్లి. 

తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్లకపోతే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.