రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టులపై చేస్తున్న ఆరోపణలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆ విషయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మాదిరిగా మన దేశంలో కూడా వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. 

వర్చువల్ కోర్టులపై తన సూచనలను సీజెకు మెయిల్ చేసినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధులకు సంబంధం ఉన్న కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన అన్నారు. ప్రత్యక్ష ప్రసారం పద్ధతి విదేశాల్లో ఉందని ఆయన గుర్తు చేశారు. జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ప్రచారం చేశారని ఆయన అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం కట్టడి చేయాలని అనుకుంటే చేయవచ్చునని ఉండవల్లి చెప్పారు. 

గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని, ఆ తర్వాత కోర్టుల తీర్పులకు లోబడి ప్రజాసేవ చేశారని ఆయన అన్నారు.