తండ్రి తరువాత తండ్రిలా కాపాడాల్సిన మేనమామే ఆ ఐదేళ్ల చిన్నారి పాలిట కర్కోటకుడిలా మారాడు. తండ్రి చనిపోయిన ఓ చిన్నారి మీద దాష్టీకం చేశాడు. విచక్షణారహితంగా కొట్టి హింసించాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. 

వివరాల్లోకి వెడితే..వెంకటేష్ అనే వ్యక్తి ఐదేళ్ల తన మేనల్లుడిని విచక్షణారహితంగా బెల్టుతో కొట్టడంతో బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. తన తల్లి ఇంట్లో లేని సమయంలో మేనమామ దారుణంగా కొట్టినట్లు బాలుడు చెప్పాడు. 

స్థానిక పెన్షన్ లైన్ లో నివాసం ఉంటున్న రుపాని మహేష్ బాబు, రాజీ దంపతులు, వీరికి వెంకన్న అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. బాలుడి తండ్రి మహేష్ అనారోగ్యంతో ఏడు నెలల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి రాజీ తమ్ముడు వెంకటేష్ బాబోగులు చూసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వెంకన్న అల్లరి చేస్తున్నాడని వెంకటేష్ విచక్షణారహితంగా కొట్టడంతో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి ఏడుపులు విన్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సై నాగబాబు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని బాలుడిని చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించారు.