ప్రకాశం: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అన్న పిలుపు పేరుతో తటస్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేలం వేస్తుంటే పదవుల ఆశ కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఎరవేస్తూ చేరికలను ఆహ్వానిస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో చేరికల వ్యవహారం జోరుగా సాగుతున్నాయి. 

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీ ఏకంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడును టార్గెట్ చేసింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైఎస్ శిష్యుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి కనిగిరి నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి టీడీపీ వల వేసింది. 

గత కొంతకాలంగా రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్న ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ వలలో చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీకి చెందిన పలువురు నేతలు ఉగ్ర నరసింహారెడ్డికి టచ్ లోకి వెళ్లారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. 

అయితే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తాను కనిగిరి నుంచి పోటీ చెయ్యాలనుకుంటున్నానని సీటు ఇస్తే తప్పక వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆహ్వానంతో ఉగ్రనరసింహారెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. తన అభిమానులు కార్యకర్తలతో కలిసి కనిగిరిలో సమావేశం నిర్వహించారు. 

తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను నియోకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అలాగే రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో కూడా ప్రజలు ఎంతో సహకరించారని చెప్పుకొచ్చారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

తనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందిన నేపథ్యంలో తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. మరోసారి కనిగిరిలో కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించి తాను టీడీపీలో చేరే అంశంపై చర్చించి ఎప్పుడు చేరతాననేది క్లారిటీ ఇస్తానని చెప్పుకొచ్చారు.  

ఇకపోతే ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడుని అంటూ చెప్పుకునేవారు. రాజకీయంగా తనను ఎంతో ప్రోత్సహించారని పలు వేదికలపై చెప్పుకొచ్చేవారు. క్లిష్ట పరిస్థితుల్లో వెన్నంటే ఉన్నారని ప్రకటించేవారు. 

అటు కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కదిరి బాబురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదనరావుపై ఏడువేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఉగ్ర నరసింహారెడ్డికి టిక్కెట్ ఇస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది.   
 
అందులోనూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు బాబూరావు. ఆ స్నేహంతోనే బాబూరావు కనిగిరి టిక్కెట్ దక్కించుకుని గెలుపొందారు. ఈసారి కూడా బాలకృష్ణ ఆశీస్సులతో టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నియోజకవర్గంలో బాబూరావుపై వ్యతిరేకత ఉందని ఆ నేపథ్యంలో టిక్కెట్ తనకే వస్తుందని ఉగ్రనరసింహారెడ్డి అంచనాలు వేస్తున్నారు.