స్కూల్ ఏజ్ లోనే ప్రేమించడం ఏమిటంటూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మందలించడంతో ఇద్దరు మైనర్ బాలురు సూసైడ్ చేసుకున్నారు.
విజయవాడ : విద్యార్థినితో అభ్యంతకరంగా ప్రవర్తించాడని ఉపాధ్యాయులు మందలించడంతో ఓ బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్నేహితుల ముందు తనకు అవమానం జరిగిందని భావించిన బాలుడు క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. స్కూల్ బిల్డింగ్ పైనుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
పెనమలూరు నియోజకవర్గం కానూరులోని నారాయణ స్కూల్లో జస్వంత్ సాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినితో అతడు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఉపాధ్యాయులకు తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో బాలికకు మెసేజ్ లు పంపినట్లు తెలిసి స్కూల్ యాజమన్యం, టీచర్లు జస్వంత్ ను మందలించారు. మరోసారి ఇలా చేస్తే బావుండదని హెచ్చరించారు.
అయితే ఉపాధ్యాయులు చెప్పిన మంచిమాటలను జస్వంత్ అవమానంగా భావించాడు. తీవ్ర మనస్తాపానికి గురయిన అతడు విద్యార్థులంతా చూస్తుండగానే స్కూల్ భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదో అంతస్తు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డ బాలున్ని స్కూల్ యాజమాన్యం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్దితి విషమించడంతో ఇవాళ జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వీడియో
బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులను అడిగి వివరాలు సేకరించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More విశాఖలో కారు బీభత్సం... 8 బైక్ లు, డివైడర్ ను ఢీకొట్టి, చెట్టెక్కించిన డ్రంకెన్ డాక్టర్.! (వీడియో)
ఇదిలావుంటే తెలిసీ తెలియని వయసులో ఓ బాలుడు బాలికను ప్రేమించడం తల్లిదండ్రులకు తెలిసి మందలించారు. దీంతో మనస్తాపానికి గురయిన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖపట్నం గాజువాకలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 15 ఏళ్ల మైనర్ బాలుడు తొమ్మిదో తరగది చదువుకుంటున్నాడు. అదే స్కూల్లో చదివే ఓ బాలికతో అతడు ప్రేమాయణం సాగిస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు ఏమిటని తల్లిదండ్రులు మందలించడంతో బాలుడు మనస్తాపానికి గురయ్యాడు. ప్రేమించే బాలికను ఉద్దేశించి ఓ సూసైడ్ లెటర్ రాసిపెట్టిన బాలుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
