శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ లో భారీగా గుంతలు ఏర్పడినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు 6, 8 గేట్ల ముందు భారీగా గొయ్యి ఏర్పడిన విసయాన్ని అధికారులు గుర్తించారు. వీటిని పూడ్చకపోతే డ్యామ్ కు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

also read:కృష్ణా నదికి భారీ వరద: 11 ఏళ్లలో ఇదే రికార్డు

ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో వరద నీరు ఈ గొయ్యిల ద్వారా దిగువకు చేరుతోంది. అయితే ఈ రకంగా వరద నీరు కిందకు చేరకుండా ఉండేందుకు గాను 2002లో కాంక్రీట్ వేశారు. అయితే ఇటీవల కాలంలో ప్రాజెక్టుకు వచ్చిన వరద కారణంగా కాంక్రీట్ కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం ఏర్పడిన గొయ్యిలను వెంటనే పూడ్చకపోతే  డ్యామ్ వైపు గుంతలు డ్యామ్ వైపు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ గోతులను పూడ్చడంతో పాటు ఇతర మరమ్మత్తులకు గాను సుమారు రూ. 900 కోట్లు అవసరమౌతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్ సమీపంలో కొండచరియలు విరిగి పడుతున్న విషయం తెలిసిందే. గత మాసంలోనూ అంతకుముందు మాసంలో కూడ ఇదే రకంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.