హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు గోడమీద పిల్లిలా ఉన్న నేతలు ఆయా పార్టీల్లోకి దూకేస్తుంటే రాజకీయ భవిష్యత్ కోసం మరికొంత మంది పక్కచూపు చూస్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరికలో భారీగానే ఉంటున్నాయి. 

తాజగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ నేత హరిశ్చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రవిచంద్రారెడ్డిలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డికి రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టుంది. 

ప్రత్యర్థి పార్టీలను తన మాటల తూటాలతో ఇరుకున పెట్టగల సమర్థుడుగా పేరుంది. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ పార్టీలో చేరకుండానే వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీసీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు కూడా. 

అలాగే వైసీపీ ఢిల్లీలో నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ముహూర్తం కుదరడంతో బీజేపీ నేత హరిశ్చంద్రారెడ్డితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిమయమైందని దాన్ని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. 

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు బాగోతం బయటపెడతానని జగన్ ను సీఎం చేసేందుకు కృషి చేస్తానని రవిచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.