గుత్తి: అనంతపురం జిల్లాలో ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. 

గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై ఆదివారం నాడు సాయత్రం లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంకు లీకై మంటలు వ్యాపించాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

యాడికి మండలం బోగలకట్టకు చెందిన రోశిరెడ్డి, నారాయణరెడ్డిలు గుత్తికి సమీపంలోని బాల సుంకులమ్మ దేవాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు.

దేవాలయంనుండి తిరిగి వస్తుండగా గుత్తి మండలం ఎంగిలిబండ కొత్తపేట మధ్య ఎదురుగా వస్తున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ బయటకు వచ్చింది. వెంటనే మంటలు చేలరేగాయి.

దీంతో రోశిరెడ్డి, నారాయణరెడ్డిలకు మంటలు వ్యాపించాయి. దీంతో వారిద్దరూ  అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో లారీ కూడ దగ్ధమైంది. టూ వీలర్ అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.