విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద గంటల తరబడి రెండు విమానాలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. ఏటీసీ నుంచి ల్యాండింగ్ సిగ్నల్స్ రాకపోవడంతో ఆ విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. రెండు విమానాల్లోనూ వందల మంది ప్రయాణికులు ఉన్నారు. 

గన్నవరం విమానాశ్రయం వద్ద దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో విమానాలకు ల్యాండింగ్ సిగ్నల్స్ ఇవ్వడం లేదు. రెండింటిలో ఒక్కటి బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానం కాగా, రెండోది ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం."

బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానంలో 67 మంది ప్రయాణికులున్నారు. ఆ విమానాలను మరో విమానాశ్రయానికి పంపిస్తారా, ఇక్కడే ల్యాండింగ్ కు అనుమతిస్తారా అనేది తేలడం లేదు. పొగ మంచు క్రమంగా తగ్గే అవకాశం ఉండడంతో గన్నవరం విమానాశ్రయంలోనే రెండు విమానాలు కూడా దిగవచ్చునని భావిస్తున్నారు. 

స్పైస్ జెట్ విమానంలో  బెంగళూరు నుంచి 67 మంది ప్రయాణికులు గన్నవరం విమానాశ్రయానికి 07.20 గంటలకు చేరుకోవాల్సి ఉంది. బెంగళూరుకి వెళ్లేందుకు 81 మంది ప్రయాణికులు గన్నవరం విమనాశ్రయంలో వున్నారు.

ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షితంగా వారు బయటపడుతారని అంటున్నారు.