విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత,ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి రెచ్చిపోయారు. ట్విట్టర్‌ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిని విసారెడ్డి అంటూ పదేపదే సంబోధిస్తూ సెటైర్లు వేశారు.

వీసారెడ్డి మీరన్నట్టు లోకేష్ మూడు శాఖలను భ్రష్టు పట్టిస్తే మీరు, మీ అధినేత కాళ్లు పట్టుకోబోయిన మోదీ ప్రభుత్వం ఆ మూడు శాఖలకే 100కు పైగా అవార్డులు ఎలా ఇచ్చారంటారు అని బుద్దా వెంకన్న నిలదీశారు. 

ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భావించి అవాకులు చవాకులు పేలుతున్నారని విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. రావాలి, కావాలి అన్న ప్రజలే రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వెన్నులో వణుకు పుట్టి, సీబీఐ కోర్టు అనుమతితో విదేశాలకెళ్లే మీరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడడం శిశుపాలుడిని గుర్తుకు తెస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.