గోవింద కోటి రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం: టీటీడీ చైర్మెన్ భూమన
టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం ఇవాళ తిరుమలలో జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాలను టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
తిరుపతి:గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యువత కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారంనాడు తిరుమలలో జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ మీడియాకు వివరించారు. రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసేలా ప్రోత్సహించనున్నామన్నారు. యువతలో భక్తి భావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎల్‌కేజీ నుండి పీజీ వరకు 20 పేజీలతో భగవద్గీత పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ. 33 కోట్లతో వడమాలపేటలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ప్రకటించారు.రూ. 300 కోట్లతో వసతి భవన నిర్మాణం చేపట్టనున్నట్టుగా టీటీడీ చైర్మెన్ తెలిపారు.
also read:సనాతన ధర్మానికి కులాలను ఆపాదించొద్దు: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మెన్ భూమన
అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.రేపటి నుండి భక్తులకు చేతికర్రలను అందిస్తామన్నారు. రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు. టీటీడీ పోటులో 413 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ. 2.46 కోట్లతో టీటీడీ ఆసుపత్రులకు మందులను కొనుగోలు చేయాలని పాలకవర్గం నిర్ణయించిందన్నారు.టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వేద పాఠశాలలో 47 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 18న శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టుగా ఆయన చెప్పారు.
టీటీడీ చైర్మెన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 10న బాధ్యతలు చేపట్టారు.టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభభుత్వం నియమించింది. గతంలో కూడ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మెన్ గా పనిచేసిన విషయం తెలిసిందే.