తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం శుక్రవారం రాత్రి ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అటవీ, పోలీసు శాఖలతో కలిసి కాలినడక మార్గంలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది.
తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం శుక్రవారం రాత్రి ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అటవీ, పోలీసు శాఖలతో కలిసి కాలినడక మార్గంలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు అటవీ శాఖ ఇప్పటికే 24X7 ప్రాతిపదికన రెండు బోనులను సిద్ధంగా ఉంచినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
అంతేకాకుండా ఈ మార్గంలో గాలి గోపురం పాయింట్ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు తిరుమలకు కాలినడక మార్గంలో పిల్లలతో కలిసి వెళ్తున్న తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక, అటవీశాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత టీటీడీ మరిన్ని చర్యలు తీసుకోనుంది.
అంతేకాకుండా.. తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారుల్లో పిల్లల అనుమతిపై టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది. అంతేకాకుండా నడకదారిలో వెళ్తున్న పిల్లలకు ట్యాగ్‌లు కూడా కడుతున్నారు. కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు మిస్ అయితే.. ఈ ట్యాగ్‌లు వారిని కనిపెట్టేందుకు సహాయపడతాయని చెబుతున్నారు. పిల్లలకు కట్టే ట్యాగ్‌లో తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీసులు కంట్రోల్ నెంబర్ రాస్తున్నారు. ఇక, రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల తర్వాత బైక్‌లకు అనుమతి నిరాకరించినట్టుగా టీటీడీ తెలిపింది.
ఇక, ఆరేళ్ల లక్షితపై చిరుతపులి దాడి ఘటనకు సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సమీక్షించారు. చిన్నారి మృతదేహం లభించిన స్థలాన్ని కూడా సందర్శించారు. తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటవీ, పోలీసు, టీటీడీ అధికారులు సాంకేతిక చర్యలతోపాటు అదనపు భద్రతా ప్రతిపాదనలతో ముందుకు వస్తే ఎలాంటి ఖర్చులకైనా టీటీడీ వెనుకాడదని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు భరోసా కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల దృష్ట్యా, వన్యప్రాణుల సంఖ్య కూడా పెరుగుతోందని, కాలినడక మార్గంలో వచ్చే యాత్రికుల ప్రాణాలను రక్షించడంపై టీటీడీ దృష్టి సారించిందన్నారు. లక్షిత కుటుంబానికి టీటీడీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టుగా తెలిపారు. అందులో రూ.5 లక్షలు టీటీడీ, మరో రూ.5 లక్షల అటవీశాఖ అందజేస్తుందని హామీ ఇచ్చారు.
