చేతి కర్రలు ఇచ్చి చేతులు దులుపుకోం.. భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అలిపిరి మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ చేశారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నడిచి వేళ్లే యాత్రికులకు అండగా వుంటామని.. ఇప్పటికే నాలుగు చిరుత పులులను పట్టుకున్నామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.

తిరుమల నడకదారిలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అలిపిరి మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ చేశారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కావాలనుకున్న వారికే కర్రలు ఇస్తామన్నారు. చేతి కర్రలు ఇచ్చి యాత్రికుల భద్రతపై చేతులు దులుపుకోమని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
టీటీడీ భక్తుల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటోందని.. భక్తుల్లో ఆత్మ విశ్వాసం నింపడం కోసమే కర్రలు ఇస్తున్నామని భూమన తెలిపారు. వన్యప్రాణుల నుంచి రక్షణ కోసమే కర్రలు ఇస్తున్నట్లు చెప్పారు. నడిచి వేళ్లే యాత్రికులకు అండగా వుంటామని.. ఇప్పటికే నాలుగు చిరుత పులులను పట్టుకున్నామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. నరసింహస్వామి ఆలయం దగ్గర భక్తుల నుంచి కర్రలు తీసుకుంటామని భూమన చెప్పారు .
Also Read: గోవింద కోటి రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం: టీటీడీ చైర్మెన్ భూమన
కాగా.. టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారంనాడు తిరుమలలో జరిగింది. గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యువత కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రామకోటి తరహాలోనే గోవింద కోటి రాసేలా ప్రోత్సహించనున్నామన్నారు. యువతలో భక్తి భావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎల్‌కేజీ నుండి పీజీ వరకు 20 పేజీలతో భగవద్గీత పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ. 33 కోట్లతో వడమాలపేటలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ప్రకటించారు . రూ. 300 కోట్లతో వసతి భవన నిర్మాణం చేపట్టనున్నట్టుగా టీటీడీ చైర్మన్ తెలిపారు.
అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు. టీటీడీ పోటులో 413 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ. 2.46 కోట్లతో టీటీడీ ఆసుపత్రులకు మందులను కొనుగోలు చేయాలని పాలకవర్గం నిర్ణయించిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వేద పాఠశాలలో 47 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు.