శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు స్పెషల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు స్పెషల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల కోసం ఆ సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాట్లు చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. సెప్టెంబర్ 18న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన వెల్లడించారు. గరుడ సేవ నాడు రద్దీని దృష్టిలో వుంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. 

భక్తులకు వైద్య సేవలు అందించేందుకు రుయా నుంచి సిబ్బందిని రప్పిస్తున్నామని.. ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు నడుపుతామని ధర్మారెడ్డి వెల్లడించారు. వన్య మృగాల సంచరిస్తుండటంతో నడక మార్గం, ఘాట్ రోడ్‌లో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. అటవీ శాఖ నివేధిక ఆధారంగా నడక దారిలో నిబంధనలను సడలిస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న గరుడ వాహనం, 23న స్వామివారి రథోత్సవం వుంటుందని ఆయన వెల్లడించారు. 

ALso Read: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. వారం రోజుల ప్రయత్నం సఫలం.. (వీడియో)

ఇకపోతే.. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వున్నారు. సర్వ దర్శనానికి ఏడు గంటల సమయం పడుతోంది. నిన్న స్వామి వారిని 71,132 మంది దర్శించుకోగా.. 26,963 మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం హుండీల ద్వారా రూ.4.06 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.