తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేసింది జగన్ సర్కార్. ఆయనను రాష్ట్ర  వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇక ఆయన స్థానంలో టిటిడిలోనే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వున్న ధర్మారెడ్డిని నియమించింది. ధర్మారెడ్డికి ఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరోవైపు తిరుమల దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డాక్టర్ శోభారాజు నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది టిటిడి ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా భోర్డు సభ్యురాలయిన శోభారాజును ఎంపికచేస్తూ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ళు కొనసాగనున్నారు. 

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో టీడీపీ, బిజెపి నేతలూ కార్యకర్తలూ ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

జగన్ అన్యమతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలని వారు వాదించారు. ఈ నేపథ్యంలో పోలీసులు బిజెపి, టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు.  చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇలా సీఎం తిరుపతి పర్యటనపై వివాదం చెలరేగడంతో ఈవోను బదిలీకి కారణమై వుంటుందన్న చర్చ మొదలయ్యింది.