శ్రీవారి భక్తులపై భారాన్ని పెంచేలా సేవల రేట్లను పెంచాలంటూ టిటిడి ఛైర్మన్ పాలకమండలి సమావేశంలో అధికారులను ఆదేశించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో తన వ్యాఖ్యలపై తాజాగా వైవి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి (tirumala venkateshwara swamy)ని సేవించుకోవాలకునే భక్తులపై మరింత భారం మోపాలంటూ టిటిడి (TTD) బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీవారికి చేసే వివిధ సేవల రేట్లను భారీగా పెంచాలంటూ టిటిడి బోర్డ్ సమావేశంలో ఛైర్మన్ అధికారులను ఆదేశిస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఛైర్మన్, టిటిడి బోర్డు సభ్యులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో శ్రీవారి సేవల ధరల పెంపుపై టిటిడి ఛైర్మన్ స్పందించారు.
శ్రీవారి ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు ఇంకా సమయం పడుతుందని... త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే నెల ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే శ్రీవారి సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదని టిటిడి ఛైర్మన్ క్లారిటీ ఇచ్చారు.
శ్రీవారి ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన కూడా ఇప్పట్లో లేదని... ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తులపై భారం పెంచే ఆలోచన టిటిడికి లేదని ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.
తిరుమల వెంకటేశ్వస్వామిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టిటిడి చర్యలు తీసుకుంటోందని సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమని... అందుకోసమే విఐపి దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఇప్పటికే సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పదిరోజులు అవుతోందని ఛైర్మన్ తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత తిరిగి సర్వదర్శనాన్ని ప్రారంభించామన్నారు. ఈ సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. ఇలా భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని టిటిడి ఛైర్మన్ వెల్లడించారు.
ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఇదిలావుంటే ఇప్పటికే శ్రీవారి సేవల ధరలు ఒకేసారి వేలకు వేలు పెంచాలంటూ టిటిడి పాలకమండలి సమావేశంలో ఛైర్మన్ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించడంపై శ్రీవారి భక్తులనే కాదు సామాన్య ప్రజలు, రాజకీయ పక్షాలకు ఆగ్రహం తెప్పించింది. భక్తుల మనోబావాలను దెబ్బతీసేలా అత్యంత నిర్లక్ష్యంగా ఛైర్మన్ సేవల రేట్ల పెంపుపై ఆదేశించడంపై దుమారం రేగింది. ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఛైర్మన్ సుబ్బారెడ్డి తీరును తప్పుబడుతూ రాజకీయ విమర్శలకు దిగారు.
ఇలా టిటిడి బోర్డు, వైసిపి ప్రభుత్వంపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సీరియస్ అయ్యారు. హిందూ దేవాలయాలను ఆదాయాన్ని కుమ్మరించే వాటిగా చూస్తూ... క్రిస్టియానిటీ, మైనారిటీ అంటే ఓటు బ్యాంకుగా చూస్తున్నారని వీర్రాజు అన్నారు. హిందుత్వం అంటే వ్యాపారం కాదని పేర్కొన్నారు.సేవా టికెట్ రేట్లు పెంచడంపై టిటిడి పునరాలోచన చేయాలని సూచించారు. టిటిడి బోర్డు పరిపాలన ధర్మ బద్దంగా ఉండాలన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాల పరిపాలన ప్రజల చేతుల్లో ఉంటుందని సోము వీర్రాజు ప్రకటించారు.
