వివేకా హత్య కేసు .. ఆధారాలు లేకనే గూగుల్ టేకవుట్ అంటున్నారు : సీబీఐపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి . గూగుల్ టేకవుట్ మొదటి నుంచి ఎందుకు లేదు..? మధ్యలో సీబీఐ ఎందుకు బయటికి తీసుకొచ్చింది అని ఆయన ప్రశ్నించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసు వెనుక ఎవరెవరు వున్నారనే వాస్తవాలను న్యాయస్థానాలు తేలుస్తాయన్నారు.
ఎవరెన్ని ఆరోపణలు చేసినా తమకు కోర్ట్‌లపై నమ్మకం వుందని పేర్కొన్నారు. గూగుల్ టేకవుట్ మొదటి నుంచి ఎందుకు లేదు..? మధ్యలో సీబీఐ ఎందుకు బయటికి తీసుకొచ్చింది అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానాలను పక్కదారి పట్టించేలా గతంలో సీబీఐ వ్యవహరించిందని ఆధారాలను కోర్టుకు సమర్పించామని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ కేసులో ఆధారాలు లేకనే గూగుల్ టేక్ అవుట్ అంటూ సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ALso Read: కోల్డ్ వార్ ఉండేది.. వివేకా హత్యకు రాజకీయపరమైన కారణాలు!: వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపైనా సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ప్రతిపక్షాలన్ని కలిసి వచ్చినా తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసమే వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని.. వాలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబర్‌లో జగన్ విశాఖలో పర్యటిస్తారని.. వైసీపీని నమ్ముకున్న అందరికీ జగన్ న్యాయం చేశారని సుబ్బారెడ్డి కొనియాడారు. ఎన్ని పార్టీలు, ఎందరు కలిసొచ్చినా ప్రజలు జగన్‌వైపే వుంటారని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌ను గద్దె దింపాలంటే మూడు పార్టీలు ఏకం కావాల్సి వస్తోందని.. అంటే జగన్ అంత స్ట్రాంగ్ అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు