Asianet News TeluguAsianet News Telugu

శ్రీవాణి ట్రస్ట్‌పై వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు, చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన కౌంటరిచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. 

ttd chairman yv subba reddy counter janasena chief pawan kalyan ksp
Author
First Published Jun 19, 2023, 4:40 PM IST

శ్రీవాణి ట్రస్ట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. బోర్డ్ సభ్యులు దోపిడి చేస్తున్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల సాయంతో దేశవ్యాప్తంగా 2,450 ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన 275 పురాతన ఆలయాలను పునరుద్ధరణ చేస్తున్నామని.. శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు, చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

అంతకుముందు .. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఒంటిమిట్టలో అన్నప్రసాద సముదాయ నిర్మాణం కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. త్వరలో గుజరాత్‌లోని గాంధీ నగర్, ఛత్తీస్‌గడ్‌లోని రాయపూర్‌లలో శ్రీవారి ఆలయ నిర్మాణాలు ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ పరిపాలనా భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు సెంటర్ ఏర్పాటుకు రూ.9.4 కోట్లు.. వేదిక్ యూనివర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్విమ్స్ ఆసుపత్రి ఆధునికీకరణ కోసం రూ.95 కోట్లు కేటాయిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇక నో ఫ్లై జోనో అయిన తిరుమలలో తరచుగా విమానాలు వెళ్తుండటంపై చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios