సారాంశం
తిరుమలలో వివాదాల మధ్య టీటీడీ అత్యవసర భేటీ నిర్వహించనుంది. భక్తుల వసతులు, భూ కేటాయింపులు, బస్సు సేవలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తిరుమలలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భక్తులకు సౌకర్యాల లోపంతో పాటు, అన్యమతస్థుల హల్చల్ అంశం కూడా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. ఇలాంటి కీలక సమావేశాన్ని ఉన్నఫళంగా ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. తిరుమలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు పరిస్థితి ఏంటి? సమావేశం ఎందుకు అనివార్యమైంది? అన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది.
ఈ సమావేశం బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరగనుంది. సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. పాలకమండలి సభ్యులకు ఈ విషయాన్ని అత్యవసరంగా తెలియజేశారు. రావలేని సభ్యులకు Zoom ద్వారా సమావేశంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.ఇక మరోవైపు ఈనెల 8వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశంలో టీటీడీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై చర్చ జరగే అవకాశం ఉంది. అందుకే ముందుగానే పాలకమండలి ఆ విషయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతిలోని అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్‌కి కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి, కొత్త స్థలం కేటాయించాలన్నదే ప్రధాన అంశంగా చెప్పొచ్చు. రహదారి పక్కన ఉన్న 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఉచిత ఎలక్ట్రిక్ బస్సు..
అంతేకాదు, భక్తుల రాకపోకల్ని సులభతరం చేయడానికి, రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్‌ల నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీని కోసం దాదాపు 20 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చే ప్రణాళిక ఉంది. ఈ ప్రతిపాదనకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు.ఇవి కాకుండా మరో రెండు కీలక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం. మొత్తంగా తిరుమలలో తీసుకుంటున్న తాజా నిర్ణయాలు, సమావేశాల వెనుక రాజకీయంగా కూడా ఆసక్తికర విషయాలు దాగివున్నాయి.ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే, భక్తుల భద్రతతో పాటు, ఇతర శ్రద్ధాలపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు టీటీడీ సీరియస్‌గా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది.