అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులవేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ దర్శనాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 

శ్రీవారిని దర్శించుకునే విషయంలో భాగంగా L1, L2, L3, దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈ దర్శనాలను ఏర్పాటు చేసిందని అందువల్లే వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు వీఐపీ దర్శనాల్లో కూడా కోతలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదికి ఒకసారే శ్రీవారి దర్శనానికి వీఐపీలు రావాలని కోరుతున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

మరోవైపు  10, 15 రోజుల్లో పూర్తిస్థాయిలో టీటీడీ బోర్డ్ నియామకం ఉంటుందని తెలిపారు. టీటీడీ బర్డ్ ఆస్పత్రిని పరిశీలించారు వైవీ సుబ్బారెడ్డి. ఆస్పత్రిలో 40 గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆపరేషన్స్ త్వరిగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఆపరేషన్ థియేటర్లలో పరికరాలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.