Asianet News TeluguAsianet News Telugu

తిరుమల వెంకన్న ను కూడా తాకిన కరోనా

తాజాగా వరల్డ్ ఫేమస్ దేవుడు తిరుపతి వెంకన్న సన్నిధిలో కూడా కరోనా నివారణ చర్యలను చేపట్టింది టీటీడీ. ప్రస్తుతానికి శ్రీవారి ఆర్జిత సేవలన్నిటిని తాత్కాలికంగా రద్దు చేసింది.

TTD announces  steps to prevent Corona Virus
Author
Tirumala, First Published Mar 14, 2020, 5:31 PM IST

కరోనా దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంది. మంత్రుల నుండి మొదలుకొని ప్రధాన మంత్రుల భార్యల వరకు ఎవ్వరిని కరోనా వైరస్ వదలడం లేదు. దాని పేరు చెబితేనే వణికి పోతున్నారు. 

వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ భారత్ లోకి విస్తరిస్తుండడంతో భారత ప్రభుత్వం కూడా అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. 

ఇక తాజాగా వరల్డ్ ఫేమస్ దేవుడు తిరుపతి వెంకన్న సన్నిధిలో కూడా కరోనా నివారణ చర్యలను చేపట్టింది టీటీడీ. ప్రస్తుతానికి శ్రీవారి ఆర్జిత సేవలన్నిటిని తాత్కాలికంగా రద్దు చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవాల నుండి సహస్ర కలశాభిషేకం వరకు అనేక ఆర్జిత సేవలను తదుపరి ఆదేశాల వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది టీటీడీ. 

ఇప్పటికే తిరుమల కొండపై కరోనా నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నారు. భక్తులను కూడా క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండనీయకుండా నేరుగా దర్శనం కల్పించేందుకు సన్నాహకాలు ప్రారంభించారు. 

టైం స్లాట్ ఆధారంగా భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ మార్గదర్శకాలను జారీ చేయనుంది. గంటకు కేవలం 4వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది. 

ఇకపోతే  తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ పై కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. 

కరోనావైరస్ నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సినిమా థియేటర్లను కూడా మూసేయాలని నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. 

షాపింగ్ మాల్స్ ను కూడా మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. శాసనసభ సమావేశాలను కూడా కుదించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి, నిరవధిక వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు నాలుగు ఉన్నాయి. వాటిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: భయంకరమైన కరోనావైరస్ కాంగ్రెసు: అసెంబ్లీలో పిట్టకథ చెప్పిన కేసీఆర్

ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఓ వ్యక్తి కరోనా వైరస్ కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యాడు. ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు తేలిందని కేసీఆర్ శనివారం శాసనసభలో ప్రకటించారు. మరో ఇద్దరు అనుమానిత కరోనావైరస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆయన చెప్పారు. 

కాగా, వికారాబాదు జిల్లాలోని అనంతగిరిలో కరోనా వైరస్ కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రయాణికులను నేరుగా అనంతగిరికి తరలించి పరీక్షలు నిర్వహిస్తారు. డబ్ల్యుహెచ్ఓ ప్రతినిధులు ఆ ప్రత్యేక ఏర్పాటును పరిశీలించారు.

Also read: తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా, ఇద్దరు అనుమానితులు: కేసీఆర్

మంత్రివర్గ సమావేశం తర్వాత అన్ని విషయాలను నిర్దిష్టంగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే, రేపటి నుంచి మాల్స్, బడులు, థియేటర్లు బంద్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios